వైఎస్సార్ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టినా రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రెండవ విడత కింద వైఎస్సార్ రైతు భరోసాను వారి ఖాతాలకు బదిలీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత సాయం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 అందిస్తున్నాం. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో 4వేలు, సంక్రాంతికి రూ.2వేలు సాయం అందిస్తున్నాము. ఇప్పటికే మే నెలలో ముందస్తుగా రూ.2వేలు సాయం చేశాం. ఈరోజు మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందిస్తున్నాం. గిరిజన రైతులకు రూ.11,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. లక్ష మంది గిరిజన రైతులకు రూ.104 కోట్ల సాయం చేస్తున్నాము.
ఎటువంటి అవినీతి, వివక్ష లేకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అర్హులందరికీ మేలు జరిగేలా వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నాం. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరా లోపు ఉన్నవారే. పెట్టుబడి సాయంతో మెరుగైన భద్రత, ఉపాధి లభిస్తుంది. తొలిసారిగా ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ ఖరీఫ్‌లోనే చెల్లిస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు.. ఖరీఫ్ సీజన్లోనే ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లించడం ఇదే తొలిసారి. 1.66 లక్షల మంది రైతులకు 135.7 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం' అని అన్నారు.
0 Comments