Telangana News : బేకరీ వద్ద పరిచయం..డిప్యూటీ జైలర్ నంటూ బెదిరింపు కాల్..


* శివ్వంపేటలో నకిలీ డిప్యూటీ జైలర్ పై కేసు

* ఎస్సై మధుకర్ రెడ్డి 

చట్టం శివ్వంపేట : తాను ప్రభుత్వ ఉద్యోగినంటూ ఓ మహిళను నమ్మించి, ఆమె భర్తను ఫోన్ లో బెదిరించిన ఘటన శివ్వంపేట మండలంలో వెలుగు చూసింది. కంది జైలు డిప్యూటీ జైలర్ పేరు చెప్పి హడలెత్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర నర్సింలు, ఎర్ర సునీత దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సునీతకు, ఆమె అత్తకు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుండడంతో ఇంట్లో మనస్పర్థలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో సునీత "సీడ్ కంపెనీకి పనికి వెళ్తున్నా" అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అయితే ఆమె పనికి వెళ్లకుండా నేరుగా శివ్వంపేటకు వచ్చింది. ఇంట్లో జరుగుతున్న గొడవలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆమె ఉద్దేశం. శివ్వంపేట పట్టణంలోని బేకరీ వద్ద ఆమెకు చెన్నాపూర్ సామ్యతండాకు చెందిన కాట్రాత్ సురేష్, అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను కంది జైలులో డిప్యూటీ జైలర్ గా పనిచేస్తున్నానని, ఎస్పీకి బాగా తెలుసునని చెప్పి సునీతను నమ్మించాడు.వెంటనే తన మొబైల్ ఫోన్ (నెం.8106092955) నుంచి సునీత భర్త నర్సింలుకు ఫోన్ చేశాడు. "నేను కంది డిప్యూటీ జైలర్ మాట్లాడుతున్నా.. నీ భార్య సునీత వచ్చి ఎస్పీని కలిసి నీపై ఫిర్యాదు చేసింది. ఎస్పీ నిన్ను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తీసుకురమ్మని ఆదేశించింది. నేను నీ దగ్గరకు వస్తున్నా" అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా కంగారుపడిన నర్సింలు వెంటనే ఆ నంబర్ గురించి ఆరా తీశాడు. ఫోన్ చేసిన వ్యక్తి జైలర్ కాదని, అతను చెన్నాపూర్ సామ్యతండాకు చెందిన కాట్రాత్ సురేష్ అని తెలియడంతో అనుమానం వచ్చింది. నర్సింలు శివ్వంపేటకు వెళ్లి భార్య సునీతను కలుసుకున్నాడు. జరిగిన విషయం అడగగా, పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేద్దామని వస్తే బేకరీ వద్ద కలిసిన వ్యక్తి తాను జైలర్ నని చెప్పి తన తరపున ఫోన్ చేశాడని సునీత తెలిపింది.
తనను ప్రభుత్వ ఉద్యోగి పేరుతో మోసం చేసి బెదిరించిన కాట్రాత్ సురేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎర్ర నర్సింలు సోమవారం శివ్వంపేట పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నకిలీ డిప్యూటీ జైలర్ గా చలామణి అయిన కాట్రాత్ సురేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Reactions

Post a Comment

0 Comments