తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..నేటి నుంచి ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..నేటి నుంచి ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ



ఈసారి నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనా.. తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగుబాట పట్టారు. పల్లెల్లో రైతన్నలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వానాకాలం సాగుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు నిధులను విడుదల చేసేందుకు రెడీ అయింది. 70 లక్షల మంది అన్నదాతలకు ఇవాళ నిధులు విడుదల చేయనుంది. రైతుబంధు నిధులు డైరెక్టుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.


ఇందుకోసం తెలంగాణ సర్కార్ రూ.7,720.29 కోట్లు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు నేరుగా రైతుల ఖాతాల్లోకి వ్యవసాయశాఖ డబ్బను జమ చేయనుంది. ఈ సీజన్‌లో కొత్తగా 5 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని వర్తింపజేసింది. దీంతో సుమారు రూ.300 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ సీజన్‌లో 1.54 కోట్ల ఎకరాలకు పంట సాయం అందుతుంది. తాజాగా విడుదల చేసిన 11వ విడతతో కలిపి రైతులకు ఇప్పటివరకూ అందిన రైతుబంధు మొత్తం సాయం రూ.72,910 కోట్లకు చేరనుంది. కొత్తగా రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు.. తమ బ్యాంకు అకౌంట్ వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

రైతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న ఆప్యాయతకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి సరఫరానే నిదర్శనాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు నిధుల విడుదల నేపథ్యంలో రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేల సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పథకాలను కొనసాగిస్తున్నారని చెప్పారు.

Post a Comment

0 Comments