(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) : తెలుగు సాహిత్యంలో అద్భుతమైన రచనలు చేసి, అనేక ప్రక్రియలను ఒడిసి పట్టి, చెరగని ముద్ర వేసిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి మహానీయుడని, తాను మరణించేవరకు కలం ఆపని యోధుడని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. సినారె జయంతి సందర్భంగా కవులు కోణం పర్శరాములు, బస్వ రాజ్ కుమార్, రాచకొండ భూపాల్, మంగళంపల్లి శ్రీనివాస్ లతో కలిసి రాజేశం నివాసంలో సినారె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు భాషలలో రచనలు చేసిన కవిగా, అనర్గళమైన భాషా పఠిమతో ముందుకు సాగారని, సినారె రచించిన విశ్వంభర కావ్య సంపుటికి జ్ఞానపీఠ్ అవార్డు లభించిందని, కేంద్ర సాహిత్య పురస్కారం పొందారన్నారు. ఎందరో యువ కవులకు సత్కారం చేసి ప్రోత్సహించిన కవి సినారె అని అన్నారు. చలనచిత్ర రంగంలో వేలాది పాటలు అందించిన సినారె జనుల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయారని, రాజ్యసభ సభ్యులుగా సేవలందిస్తూనే సామాజిక చైతన్య రచనలతో నవ కవిత్వానికి జీవం పోసి, యువ కవులకు బాటలు వేశారన్నారు. సినారె పల్లె జీవన చిత్రం రచనల ద్వారా సాహిత్య పరిమళాలు వెదజల్లారని అన్నారు. సినారె రచనలు పలు భాషలలోకి అనువాదం జరిగాయని అన్నారు. సినారె రచనలు ఎల్లప్పుడూ సజీవంగా నిలిచేలా గుర్తుచేస్తాయని, అట్టి మహా కవి సినారె బాటలో కవులందరు సాగాలన్నారు.

0 Comments