కన్న కొడుకును చూడాలనే తపనతో లాక్ డౌన్ ను లెక్కచేయలేదు ఓ తల్లి. ఒంటరిగానే తన స్కూటీ పై సుమారు 1400 వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అష్టకష్టాలు పడి తన కొడుకు వద్దకు చేరి.. తల్లి ప్రేమకు సాటిలేదని నిరూపించుకుంది. తన కొడుకును వెంటబెట్టుకు వచ్చింది. పట్టువదలని ఆమె ధైర్యానికి అందరు శబ్బాష్ అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ వాసి రజియా సుల్తానా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. లాక్ డౌన్ కారణంగా ఏపీలోని నెల్లూరులో చిక్కుకుపోయిన కొడుకు కోసం పెద్ద సాహసం చేసింది. స్నేహితుడి తండ్రి అనారోగ్యంగా ఉండటంతో మార్చి 14న నెల్లూరు జిల్లాలోని రహ్మతాబాద్ వెళ్లాడు కొడుకు నిజాముద్దీన్.
22 నుంచి లాక్ డౌన్ ప్రవేశపెట్టడంతో సొంతూరు బోధన్ రాలేక ఉండిపోవాల్సి వచ్చింది. అసలే కష్టకాలం.. దానికితోడు కొడుకును చూడలేక ఉండలేకపోయిన ఆ మాతృమూర్తి వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేసింది.. అందుకు ఏమాత్రం అవకాశం లేకపోయింది. ఇక తానే వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను ఆశ్రయించింది. తన ఈ ప్రయాణంలో అడుగడుగునా పోలీసులు అందించిన సహకారం మరువలేదని రజియా కృతజ్ఞతలు చెప్పుకుంది.. కొడుకు మీద బెంగపెట్టుకున్న రజియా ఈ నెల 6న ఉదయం బోధన్ నుంచి నెల్లూరు జిల్లా రహ్మతాబాద్ కు స్కూటీ ఫై ఒంటరిగా బయలుదేరింది. పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం వెంటబెట్టుకుని ప్రయాణం మొదలెట్టింది.
దారి మధ్యలో అక్కడక్కడ అగుకుంటూ సుదీర్ఘ ప్రయాణం చేసింది.. లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండిలేక అవస్థలు పడింది. అయినా కొడుకు మీద మమకారంతో 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఆయా జిల్లాల పోలీసు అధికారుల సహకారంతో రహ్మతాబాద్ లోని కొడుకు వద్దకు చేరుకుంది. కొడుకు కోసం చేసిన ఈ ప్రయాణం తనకు కష్టం అనిపించలేదని, పిల్లాడి కన్నా తనకేది ముఖ్యం కాదని రజియా చెప్పుకుంది. కరోనా విస్తరించుకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించింది రజియా. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని కోరిందామే.
0 Comments