హైదరాబాద్: ఇంకా కొన్ని రోజులు లాక్‌డౌన్ కొనసాగించాలన్నది తన అభిప్రాయమని ముఖ్యమంత్రి అన్నారు. బోస్టన్ నివేదిక కూడా దేశంలో జూన్ 3వ తేదీ వరకు లాక్‌డౌన్ కొనసాగించాలని పేర్కొందని ఆయన గుర్తు చేశారు. సోమవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఆర్థికంగా దేశం దెబ్బతింటోందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఇబ్బందులు వస్తాయని.. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై చర్చలు కొనసాగుతున్నాయని కేసీఆర్ అన్నారు.
అమెరికా లాంటి పరిస్థితులు దేశంలో లేకపోవడం మన అదృష్టమని కేసీఆర్ అన్నారు. దేశ జనాభాతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, కరోనా వైరస్ భయానక పరిస్థితులు లేవని ఆయన అన్నారు. 22 దేశాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతోందని, జపాన్‌లో నెలపాటు లాక్‌డౌన్ ప్రకటించారని అన్నారు. కాగా, ఇక 90 దేశాలు పాక్షిక లాక్‌డౌన్ పాటిస్తున్నాయని పేర్కొన్నారు. అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాలో శవాల గుట్టలు కనిపిస్తున్నాయని అన్న కేసీఆర్ దేశంలో లాక్‌డౌన్ వల్ల కరోనా ఉధృతి తగ్గిందని అన్నారు.

0 Comments