
ఇప్పుడు అందరి దృష్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పైనే ఉంది. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రెండు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగనుంది. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండో రౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను కౌంట్ చేస్తారు. ఉదయం 9 గంటల కల్లా ఫలితం వచ్చేస్తుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా 821 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. ప్రాధాన్య ఓటింగ్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ఉండనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేననే ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు... పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు రెడీ అయ్యాయి.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బోధన్‌కు చెందిన ఓ కౌన్సిలర్ చనిపోగా, మరో ఇద్దరు ఓటర్లు కరోనా వల్ల పోస్టల్ బ్యాలెట్ ఎంచుకున్నారు. 9న జరిగిన ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదైంది. 821 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 100 శాతం కాగా నిజామాబాద్‌లో 99.64 శాతం మంది ఓటేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం అధికారులు 50 పోలింగ్ బూత్‌లకు 6 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌పైన 100 ఓట్లు లెక్కిస్తారు. రెండో రౌండ్‌లో రెండు లేదా మూడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలోనే ఫలితాలను ప్రకటిస్తారు.
0 Comments