రామాయణం నిజమేనా! జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా ?

రామాయణం నిజమేనా! జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా ?

Ramayanam Mystery : చాలామంది రామాయణం అంతా ట్రాష్ అంటారు. కేవలం పుస్తకాల్లో రామాయణం గురించి రాశారు తప్పితే.. అసలు రామాయణం అనేది లేదు అంటూ కొందరు నాస్తికులు కొట్టిపారేస్తుంటారు. కానీ.. రామాయణం నిజం అని చెప్పేందుకు ఇప్పటికీ కొన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. వాటిని చూస్తే నిజంగానే రామాయణం జరిగిందని, రాముడు ఉన్నాడని.. రావణుడు ఉన్నాయని.. యుద్ధం జరగడం నిజమే అని నమ్ముతాం. పదండి..

రామాయణం ప్రకారం యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడిపై శక్తి అస్త్రాలను ప్రయోగించడంతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు హన్మంతుడు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని మూలికతో లక్ష్మణుడిని బతికించాడు. ఈ ద్రోణగిరి పర్వతమే శ్రీలంకలోని రుమసల పర్వతం. రామాయణం ప్రకారం అశేషమైన వానర సైన్యం లంకను చేరుకోవడానికి కేవలం 5 రోజుల్లోనే రామసేతు వారధిని నిర్మించింది. ప్రస్తుతం రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు గల ఆడమ్స్ బ్రిడ్జియే రామసేతు. ఇలా.. రామాయణం నిజం అని నిరూపించే సాక్ష్యాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి.


సీతమ్మను అపహరించుకొని వెళ్లిన తర్వాత రావణుడు 11 నెలలు అశోకవనంలో బంధించాడు. ప్రస్తుత శ్రీలంకలో సముద్ర మట్టానికి 6200 అడుగుల ఎత్తులో నువారా ఏరియా అనే నగరం ఉంది. దీనికి సమీపంలో సీతా ఎలియా అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో సీతానది ఒడ్డున 3000 సంవత్సరాల నాటి సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయం వెనుక ఒక దట్టమైన అడవి ఉంటుంది. ఈ అడవిలో ఎక్కువ భాగం అశోక చెట్లు ఉండటం చేత దీన్ని అశోక వనం అని పిలుస్తున్నారు. ఈ అడవిలోని మట్టి నల్లగా ఉంటుంది. సీతానదికి అవతల వైపు ఉన్న మట్టి ఎర్రగా ఉంటుంది. రామాయణం ప్రకారం హన్మంతుడు అశోకవనాన్ని తగులబెట్టాడని చెబుతుంటారు. అందుకే ఇక్కడి మట్టి నల్లగా ఉంటుందని నమ్ముతుంటారు.

వానరులు రావణలంకను చేరుకోవడానికి అనువైన ప్రదేశాన్ని వెతికారు. అప్పుడు వాళ్లకు తమిళనాడులోని రామేశ్వరం లంకను చేరుకోవడానికి సరైన మార్గం అనుకుంటారు. కానీ.. లంకకు చేరుకోవడానికి దారిని ఇవ్వాలని సముద్రుడిని రాముడు కోరుతాడు. కానీ.. సముద్రుడి నుంచి ఎటువంటి స్పందన ఉండదు. దీంతో కోపంతో రాముడు సముద్రుడిపై శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై శ్రీరామచంద్రప్రభు నన్ను క్షమించండి. నేను మీకు దారిని ఇవ్వలేను కానీ.. లంకకు చేరుకోవడానికి ఒక అనువైన మార్గం చెప్పగలను. మీ వానరసైన్యంలో ఒకడైన నలుడు సాక్షాత్తు దేవతాశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడు. అతడు తన తండ్రికి సమానమైన నైపుణ్యం కలవాడు. అతడు మాత్రమే మీరు లంకకు చేరుకోవడానికి అవసరమైన వారధిని నిర్మించగలడు అని చెప్పి సముద్రుడు అదృశ్యమయ్యాడు.
అప్పుడు నలుడు..

వానర సైన్యం వైపు చూస్తూ మిత్రులారా.. మీ కంటికి కనబడే ప్రతి చెట్టును, పెద్ద పెద్ద బండరాళ్లను సైతం పెకిలించుకొని తీసుకురండి. వెంటనే మనం వారధి నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాం అని ఆదేశిస్తాడు. వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్లను, చెట్లను పెకిలించుకొని తీసుకొచ్చారు. ఇలా.. అశేషమైన వానరసైన్యం కేవలం 5 రోజుల్లోనే రామేశ్వరం నుంచి లంకలోని మన్నార్ ద్వీపం వరకు 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పుతో రామసేతును నిర్మించారు. 1480 వరకు ఈ వారధిపై మనుషులు రాకపోకలు కొనసాగించేవారని.. కాలం గడిచే కొద్దీ వాతావరణంలోని మార్పుల వల్ల సముద్ర నీటి మట్టం పెరగడంతో ఈ రామసేతు 10 మీటర్ల లోతుకు మునిగిపోయింది. ఈ మునిగిపోయిన బ్రిడ్జ్ నే ప్రస్తుతం ఆడమ్స్ బ్రెడ్స్ అని పిలుస్తున్నారు.

రామాయణం ప్రకారం కిస్కింద రాజ్యానికి చెందిన వాలీ, సుగ్రీవులు కవలలు. సుగ్రీవుడి కంటే వాలి ఎంతో బలవంతుడు. ఇంద్రుడు అతడికి కాంచనమాలను బహుకరించడం వల్ల వాలి తన బలవంతుడయ్యాడు. ఒకరోజు వాలి, సుగ్రీవులు మాయావి అనే రాక్షసిని చంపడానికి వెళ్లారు. వాలి ఒక గుహలోకి వెళ్లి మాయావితో పోరాడుతున్నాడు. కొంత సమయం తర్వాత గుహ నుంచి రక్తం బయటికి వచ్చి శబ్దాలు రావడం ఆగిపోయాయి. దాంతో సుగ్రీవుడు వాలి చనిపోయాడనుకున్నాడు. మళ్లీ ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఒక పెద్ద బండరాయిని అడ్డు పెట్టి తన రాజ్యానికి బయలుదేరాడు. రాజ్యానికి వచ్చి తన అన్న మరణ వార్తను అందించాడు. మంత్రుల సలహా మేరకు పట్టాభిశక్తుడై కిస్కింద రాజ్యానికి రాజయ్యాడు. కానీ.. మాయావితో జరిగిన యుద్ధంలో వాలి చనిపోలేదు. సుగ్రీవుడు రాజు అయ్యాక మళ్లీ తిరిగి వచ్చాడు. పదవి కోసం తనను మోసం చేశావని సుగ్రీవుడిని నిందించాడు. సుగ్రీవుడి భార్య అయిన రుమాదేవిని పెళ్లి చేసుకొని అతడిని రాజ్యం నుంచి తరిమేశాడు. దీంతో సుగ్రీవుడు ఒక గుహలో తలదాచుకున్నాడు. రావణుడు సీతను అపహరించుకొని వెళ్లేటప్పుడు ఆమె తన ఆభరణాలను ఒక శాలువాలో చుట్టి కిందకు పడేస్తుంది. ఆ ఆభరణాలను సుగ్రీవుడు ఆ గుహలోనే దాచిపెట్టాడు. శ్రీరాముడిని కలిశాక వాటిని ఆయనకు అప్పగించాడు. ఈ గుహ కర్ణాటకలోని హంపీలో ఇప్పటికీ ఉంది.

Post a Comment

0 Comments