ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 10 వేలు జమ చేసిన సీఎం జగన్.. డబ్బు పడ్డాయో, లేదో ఇలా చెక్ చేసుకోండి!

ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 10 వేలు జమ చేసిన సీఎం జగన్.. డబ్బు పడ్డాయో, లేదో ఇలా చెక్ చేసుకోండి!

 



వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద 1,08,755 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.109 కోట్లు జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున జమ చేశారు. దీంతో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి చేకూరింది.

అంతకు ముందు సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలను దగ్గరగా చూసినట్లు చెప్పారు. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని సూచించారు. గతంలో కొంత మందికి మాత్రమే పరిహారం అందేదని.. ఇవాళ అర్హులందరికీ మత్స్యకార భరోసా అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో 12 వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం అందించారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి 50 వేల మందికి పరిహారం ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు అని.. ఇవాళ మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదే రూ.109 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు.

అలాగే, ప్రతిపక్ష నాయకులపై సైతం సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు మంచి చేశామని చెప్పే ధైర్యం లేదన్నారు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం ఆయన దత్తపుత్రుడికి కూడా లేదని పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేశామని.. నిజాయితీ, నిబద్ధతో ప్రజల ముందుకు వస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మంచి చేస్తే చంద్రబాబు దుష్టచతుష్టయం, వీరి దత్తపుత్రుడు జీర్ణించుకోలేరని దుయ్యబట్టారు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్‌ చేస్తారని ఆరోపించారు. పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు.

భరోసా డబ్బులు పడ్డాయో, లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే..


వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద సీఎం జగన్ జమ చేసిన రూ. 10 వేలు పడ్డాయో, లేదో తెలుసుకునేందుకు లబ్ధిదారులు వారి అకౌంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష మందికి పైగా డబ్బు జమ కావాల్సి ఉంటుంది కాబట్టి, ఇప్పటికిప్పుడు పడలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. శుక్ర, శనివారాల్లో ఎప్పుడైనా అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బులు పడకపోతే 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, సంబంధి గ్రామ, వార్డు వాలంటీర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Post a Comment

0 Comments