ఆ ఆదాయం ఖర్చంతా అక్కడే.. మున్సిపాలిటీలపై సీఎం జగన్ క్లారిటీ


ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీ) అయిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టవలసిన సంస్కరణలపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదు, ఆ డబ్బును అక్కడే ఖర్చు చేయాలని సూచించారు. స్ధానికంగా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం వ్యయం చేయాలని అన్నారు. ఈ మెసేజ్‌ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని సీఎం జగన్ అన్నారు.


మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆ ఎస్‌ఓపీలు ఉండాలి. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Reactions

Post a Comment

0 Comments