ఏపీలో 2021, జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే జరగనుంది. ఈ పక్రియను మహా యజ్ఞంలా నిర్వహించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో సమగ్ర భూసర్వేపై సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనవరి 1 నుంచి సర్వే చేయాలన్న సీఎం.. గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశించారు. సర్వే బృందాలను పెంచి అక్కడికక్కడే వివాదాలను పరిష్కరించాలని సూచించారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలన్న ఆయన.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇక భూ సర్వేలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ఎక్కడికక్కడ మొబైల్ ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్. వీటి ద్వారా ఎక్కడికక్కడ వివాదాలను పరిష్కరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభల ఏర్పాటు ద్వారా సమగ్ర భూ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అర్బన్ ప్రాంతాల్లోనూ భూ సర్వే చేపడతారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఎమ్మార్వోలు, సర్వేయర్లతో పాటు ఇతర అధికారులు క్షేత్ర స్థాయిలో రంగంలో ఉంటారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితో పాటు అదనంగా ఔట్ సోర్సింగ్ పద్దతిన నియామకాలు కూడా చేపట్టనున్నారు.
0 Comments