దాదాపు 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28 నుంచి రైతుబంధు డబ్బులు అందించాలని ఇటీవల అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జమ చేసిన తరహాలోనే ఒక ఎకరం నుంచి ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి 15లోపు రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా అందించాలని సూచించారు.
కేసీఆర్ ఆదేశాలతో బుధవారం నుంచి రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు అంతా సిద్దం చేసుకున్నారు. తొలుత రెండు ఎకరాల్లోపు పోలం ఉన్న రైతులకు డబ్బులు పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులకు వారం రోజుల ముందుగానే రైతబంధు డబ్బులను జమ చేశారు. సెస్ ఎన్నికలు ఉండటం వల్ల ఆ జిల్లా రైతులకు ఇప్పటికే నగదు వేశారు. ఇక కరీంనగర్ జిల్లా రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 7వరకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో కొంతమంది కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందటంతో.. వారికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
యాసింగ్ సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వనుంది. నేటి నుంచి రైతుబంధు డబ్బులు పడుతుండటంతో.. రైతులు ఉత్సాహంలో ఉన్నారు. రైతుబంధు పథకం కింద ప్రతి ఏడాది ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలన్నింటిలోనూ ముఖ్యమైన పథకం ఇదేనని చెప్పవచ్చు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను సీఎంగా ఉన్నంతకాలం రైతుబంధు పథకం ఆపేదే లేదని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ఈ పథకం మొదలవ్వగా.. ఇప్పటివరకు తొమ్మది విడతల డబ్బులు అందించారు.
0 Comments