కానీ, తాను వివాహితుడినని.. తన భార్య సీత అని రాముడు చెప్తాడు. దీంతో సీతపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది శూర్పణఖ. ఆమెకు బుద్ధి చెప్పడానికి లక్ష్మణుడు ముక్కు కోసేస్తాడు. శూర్పణఖ ఏడుస్తూ అన్న లంకేశ్వరుడి దగ్గరకు వెళ్తుంది. శ్రీరాముడి దగ్గర అతి సౌందర్యవతి అయిన సీత ఉందని.. ఆమెను అపహరించుకు వచ్చి పెళ్లాడమని కోరుతుంది. చెల్లెలి కోరిక మేరకు రావణుడు వెళ్లి సీతను ఎత్తుకొచ్చేస్తాడు. సీత కోసం వానర సైన్యంతో కలిసి రాముడు యుద్ధం చేస్తాడు. రావణుడిని వధించి సీతను కాపాడి లోక కళ్యాణం చేస్తాడు శ్రీరాముడు. ఇదీ క్లుప్తంగా రామాయణం.
అయితే, ‘ఆదిపురుష్’ రూపంలో తెరపై చూపించింది పూర్తిగా రామాయణం కాదు. రామాయణంలోని సారాంశాన్ని మాత్రమే తీసుకుని ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు ఓం రౌత్. ప్రధాన పాత్రలకు సైతం నేరుగా రామాయణంలో ఉన్న పేర్లు పెట్టకుండా రాఘవ (రాముడు), జానకి (సీత), శేషు (లక్ష్మణుడు), భజరంగ్ (హనుమాన్).. ఇలా పర్యాయపదాలను వాడారు. ఇప్పటి వరకు రామాయణాన్ని చూడని విధంగా వీఎఫ్ఎక్స్ సాయంతో కళ్లకు ఇంపైన విజువల్స్‌ను తెరపై ఆవిష్కరించారు. రాఘవుడు శివధనుస్సును విరిచి జానకిని పరిణయమాడడం దగ్గర నుంచి వనవాసానికి వెళ్లేంత వరకు పెయింటింగ్ విజువల్స్‌తో క్లుప్తంగా చూపించారు.
రావణాసురుడు హిమాలయాల్లో తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందినప్పటి నుంచి అసలు సినిమా మొదలైంది. సినిమా ప్రారంభం నుంచే విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అంతేకాదు.. బ్రహ్మదేవుడు, రావణుడి పాత్రల వేషధారణలు కూడా కాస్త మోడరన్‌గా ఉన్నాయి. ముఖ్యంగా రావణాసురుడి కాస్ట్యూమ్స్ చిత్రంగా అనిపిస్తాయి. మార్వెల్ సినిమాల్లోని సూపర్ హీరో కాస్ట్యూమ్‌లా ఉంది రావణుడి డ్రెస్. ఇక ఆయన ఆకారం కూడా కొత్తగానే ఉంది. టీజర్‌లో చూసినట్టుగానే గెడ్డం, మంచి హెయిర్‌స్టైల్‌తో మోడరన్‌గా ఉన్నాడు రావణుడు. ఇక ఆయన దశకంఠ అవతారాన్ని కూడా కొత్తగా చూపించారు.
వనవాసంలో రాఘవుడి పాత్రను పరిచయం చేయడానికి ఒక యాక్షన్ సీక్వెన్స్‌తో కూడిన ఇంట్రడక్షన్ సీన్ పెట్టారు దర్శకుడు. రాఘవుడి మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా ఆయన శక్తిని మాత్రం తెలియజెప్పే విధంగా ఉంది ఆ యాక్షన్ సీక్వెన్స్. పూర్తిగా వీఎఫ్ఎక్స్ ఆధారంగా ఈ ఫైట్ సీక్వెన్స్ సాగింది. అయితే, ఈ వీఎఫ్ఎక్స్ అంత అద్భుతంగా ఏమీ లేవు. కానీ, 3డీలో చూడటానికి అయితే బాగున్నాయి. ఆ తరవాత రాఘవ, జానకిల మీద చిత్రీకరించిన సన్నివేశాలు చాలా అందంగా ఉన్నాయి. ప్రతి విజువల్ కళ్లకు ఇంపుగా ఉంటుంది. రాఘవుడిగా ప్రభాస్ ఆహార్యం, అందం కట్టిపడేస్తాయి. జానకిగా కృతిసనన్ కూడా అందంగా ఉన్నారు.
0 Comments