వ్యవసాయానికి ఉచిత కరెంట్ సరఫరా పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తారు. ఆ మీటర్ల నెలవారీ బిల్లులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే మొత్తాన్ని డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకోసం ప్రతి ఏటా రూ.8409 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఏపీలో రైతులకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. రైతులు తమ పొలాల మీదుగా వెళ్లే విద్యుత్ లైన్ ద్వారా బోర్ మోటర్లకు కనెక్షన్ తీసుకొని.. నీళ్లు పారిస్తున్నారు. ఆ వ్యవసాయ కనెక్షన్‌లకు ప్రస్తుతం ఎలాంటి మీటర్లు లేవు. నేరుగా విద్యుత్ లైన్ నుంచే బోర్ స్టార్టర్ కనెక్షన్ ఇస్తున్నారు. ఐతే వచ్చే ఏడాది నుంచి ఇందులో సమూల మార్పులు చేయనున్నారు. ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్ బిగించి బిల్లులు జారీ చేస్తారు. ఆ బిల్లు మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో ప్రభుత్వం నగద జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతులు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
0 Comments