కరోనా వైరస్ (కోవిడ్ 19) నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో తిరుగులేని రికార్డు సృష్టించింది. కరోనా పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు దేశంలో రెండు రాష్ట్రాలు మాత్రమే 10 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏపీ ఈ ఘనత అందుకున్న మూడో రాష్ట్రంగా నిలిచింది. అయితే మొదటి రెండు స్థానాల్లో ఉన్న తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటగా, ఏపీలో కేవలం 18 వేలు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10,17,140 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం సంఖ్య మిలియన్ దాటింది.
కాగా, రాష్ట్రంలో మొత్తం 10 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 18,697కు పెరిగాయి. కరోనా వల్ల కర్నూలు జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14మంది చనిపోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 232కి చేరింది. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,422 నమోదయ్యింది. మరో 10,043 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
0 Comments