ఈ మేరకు కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. అంతకుముందు రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం కూల్చివేతలకు ముందస్తు పర్యావరణ అనుమతి అవసరంలేదని హైకోర్టుకు నివేదించింది. దీంతో ఆయా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.
0 Comments