(చట్టం - కామారెడ్డి /శ్రీనివాస్) పల్లెలు పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రకాశవంతంగా మారుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. పిట్లం , జుక్కల్, మదునూర్ ఎంపీడీవో కార్యాలయాలలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లె ప్రగతి పనులు ఆగష్టు 10 లోగా పూర్తిచేయాలని సూచించారు. కంపోస్టు షెడ్ల ఏర్పాటుతో ప్రతి గ్రామం సంపద కేంద్రంగా మారాలని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ కంపోస్టు షెడ్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. హోమ్ స్టీడ్ మొక్కలకు సంబంధించి ప్రతి ఇంటికి అందించిన మొక్కల వివరాలను పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలని, గ్రామపంచాయతీ నర్సరీలలో మిగిలిన మొక్కలను సంరక్షించాలని తెలిపారు. గ్రామాలలో మిగిలిపోయిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో ఫాగింగ్ మిషన్ దాతల సహకారంతో లేదా గ్రామపంచాయతీ నిధులతో కొనుగోలు చేయాలని తెలిపారు. దాతల సహకారంతో బాడీ ఫ్రీజింగ్ మిషన్లు పొందాలని సూచించారు. ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం పనులు పూర్తయిన తర్వాత పూర్తి అయినట్లుగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని సూచించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డ్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కోరారు. మంకీ ఫుడ్ కోర్టుల నిర్మాణం ను పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో హరిత హారంలో నాటిన మొక్కలు 85% బతికే విధంగా చూడాలని సూచించారు. సర్పంచులు, కార్యదర్శి సమన్వయంతో పనిచేసి గ్రామాలను ప్రగతిపథంలో నడిపించాలని కోరారు. స్మశాన వాటికల నిర్మాణం, డంపింగ్ యార్డులు, అవెన్యూ ప్లాంటేషన్ పనులపై సమీక్ష నిర్వహించారు. తిమ్మా నగర్, పెద్ద కొడప్గల్, ఖండే బేలూరు, మద్నూర్ లోని రైతు వేదిక భవనాల నిర్మాణం పనులను పరిశీలించారు. రైతు వేదికలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పూర్తి స్థాయిలో వివరాలు తెలియ చేసేందుకు, రైతుల వివరాలు సేకరించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. రైతు వేదికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి వినియోగం లోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత పాటించాలని కోరారు. ప్రతి రైతు వ్యవసాయ పరంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతిని తదితర అంశాలు చర్చించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఎంపీపీ కవిత, జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో లు శ్రీనివాస్ గౌడ్, యుగేందర్, తహసీల్దార్ సుధాకర్, వెంకటేష్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
0 Comments