బాన్సువాడలో కరోనా భయం.. ఏకంగా పోలీస్ స్టేషన్ మూసివేత

బాన్సువాడలో కరోనా భయం.. ఏకంగా పోలీస్ స్టేషన్ మూసివేత

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనా వైరస్ భయం పోలీస్ స్టేషన్ మూసివేతకు దారి తీసింది. బాన్సువాడలోని చైతన్య కాలనీలో నివాసం ఉండే ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆ మహిళకు ప్రైమరీ కాంటాక్టు అయిన ఆమె కుమారుడు తనకు కూడా కరోనా పరీక్ష చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను కోరాడు. అయితే, కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్ష చేస్తామని వైద్యులు తెగేసి చెప్పారు. దీంతో ఆ యువకుడు వైద్యులపై ఫిర్యాదు చేసేందుకు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనకు డాక్టర్లు కరోనా పరీక్షలు చేయడం లేదంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించాడు. వారు వినకపోవడంతో నానా హంగామా చేశాడు.

దీంతో పోలీసులు ఆ యువకుడిని ఎట్టకేలకు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు కరోనా సోకిన మహిళకు కుమారుడు కావడం, ప్రైమరీ కాంటాక్టు కావడంతో పోలీసులు పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు. బాన్సువాడలో కరోనా వైరస్ నేపథ్యంలో కొంత మంది వ్యాపారులు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలు ఎవరికి వారే మూసేసుకుంటున్నారు.

Post a Comment

0 Comments