కామారెడ్డి: తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్లి పెటాకులైంది. ఆరు నెలల్లోనే విడాకులు అయ్యాయి. ఆ తర్వాత పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇదే సమయంలో అండగా ఉంటానంటూ వచ్చిన ఓ యువకుడిని నమ్మి ప్రేమ వివాహం చేసుకుంది.
కానీ అప్పుడు తనకు తెలియదు.. ప్రేమించిన వాడే పాడే కడుతాడని. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ఈ దారుణం జరిగింది. గుడితండాలో శిరీష(21) అనే వివాహిత హత్యకు గురైంది. తెల్లవారుజామున భర్త గొంతు నులిమి చంపేశాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడి తండాకు చెందిన శిరీషకు మొదట మండలంలోని గౌరారం కు చెందిన యువకుడితో పెళ్లి జరిగింది. అయితే ఆరు నెలల్లోనే ఇద్దరికీ కుదరక పెద్దమనుషుల సమక్షంలో విడాకులు అయ్యాయి.
ఆ తర్వాత శిరీష తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. దీంతో తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి పుట్టింటి వద్ద జీవించారు. పిట్లంకు చెందిన శ్రీకాంత్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే హైదరాబాద్ కు వెళ్లి జీవిస్తున్నారు. అయితే పదిహేను రోజుల కింద ఇద్దరూ తిరిగి వచ్చారు. శిరీష పుట్టింటికి వెళ్లగా.. శ్రీకాంత్ పిట్లంలోని తన ఇంటికి వెళ్లారు. వచ్చినప్పటి నుంచి ఇద్దరూ తరచూ గొడవ పడుతున్నారని శిరీష బంధువులు పోలీసులకు చెప్పారు.
ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా గొడవ జరగగా శిరీషను భర్త గొంతు నులిమి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. గొంతుపై, మెడ మీద గొంతు నులిమిన ఆనవాళ్లు గుర్తించినట్లు సీఐ టాటాబాబు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని మృతదేహం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు….
0 Comments