ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. పుణె నుంచి ప్రత్యేక కార్గో విమానంలో 3.72 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులు తరలించనున్నారు. కోఠి ఆరోగ్య కేంద్రంలో 40 క్యూబిక్ మీటర్ల వాకిన్ కూలర్ ఏర్పాటు చేశారు. ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొవిడ్ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల వద్ద అదనంగా టీకాలు అందుబాటులో ఉంచాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ తీసుకునే వారంతా అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని ఆదేశించారు.
కోఠిలో టీఎస్ ఎంఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రంలో కోటిన్నర డోసులు భద్రపర్చ వచ్చని అధికారులు వివరించారు. ఇక జిల్లాల్లో ఉన్న కేంద్రాల్లో సైతం మరో కోటిన్నర డోసులు భద్రపరిచే సామర్థ్యం ఉండటంతో రాష్ట్రంలో 3కోట్ల డోసులను ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయినట్టు అధికారులు స్పష్టం చేశారు.
0 Comments