శభాష్‌ కలెక్టర్‌: సీఎం జగన్‌ అభినందనలు

శభాష్‌ కలెక్టర్‌: సీఎం జగన్‌ అభినందనలు


గోదావరి వరద సహాయక చర్యలు, పునరావాసం ఏర్పాట్లు బాగా చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ రేవు ముత్యాలరాజును అభినందించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితి, కోవిడ్‌–19, ఇళ్ల పట్టాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, నాడు–నేడు, వైఎస్సార్‌ చేయూత, ఆర్‌బీకేలకు అనుబంధంగా గిడ్డంగుల నిర్మాణం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ వరద ముంపునకు గరైన ఇళ్ల నష్టం అంచనా నమోదు ప్రారంభించామని వివరించారు. కోతకు గురైన పాత పోలవరం నెక్లెస్‌ బండ్‌ను పటిష్టపరిచే పనులను చేపట్టామని పేర్కొన్నారు.

రానున్న మూడు నెలల్లో వరదలు వచ్చినా ఇబ్బంది లేని పరి స్థితి ఉంటుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏదైనా సహాయం అవసరమైతే ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో మాట్లాడాలని సూచించారు. తొలుత సీఎం జగన్‌ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో కలెక్టర్‌ కృషి అభినందనీయమన్నారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, వారికి అందించాల్సిన సహాయాలు సకాలంలో అందించడంలో తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ముంపునకు గురైన గృహాల నష్టం అంచనా నివేదికలు త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్‌ 7 నాటికి బాధితులకు సహాయం అందేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

Post a Comment

0 Comments