ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వైఎస్సార్‌‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వైఎస్సార్‌‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం


సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చిన విధంగా వారు తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సెప్టెంబర్ 11న ప్రారంభించాలని మంత్రివర్గం తీర్మానించింది. ఆసరా పథకం ద్వారా ఏపీలోని లక్షల మంది డ్వాక్రా మహిళలు రాబోయే నాలుగేళ్లలో 27 వేల కోట్ల రూపాయల మేర లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 1న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్ఆర్ విద్యాకానుక పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. సెప్టెంబర్ 5న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇక డిసెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ అమలు చేయాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించింది. ఇక బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుతో పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు ఏపీ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మరోవైపు ఈ నెల 25 జలవివాదాలపై జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం అంశం కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వాదనలను బలంగా వినిపించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.

Post a Comment

0 Comments