మహిళా స్వయం సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రఖ్యాత కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుందని వెల్లడించారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్.. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఎం సమక్షంలో పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. సోమవారం ‘రక్షా బంధన్’ సందర్భంగా ఏపీ మహిళలకు సీఎం జగన్ వరాలు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద రూ. 4,500 కోట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 ఇస్తామన్నారు. మొత్తంగా ఈ పథకం కింద మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు అందజేస్తామని వెల్లడించారు.
అలాగే సైబర్ నేరాలను అరికట్టేందుకు కూడా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇప్పటికే 18 దిశ పోలీస్‌స్టేషన్లు ప్రారంభించామని, వేధింపులపై ఎక్కడ ఫిర్యాదు చేసినా దిశ పోలీసులకు కేసు వెళ్తుందన్నారు. వారంలోనే చార్జిషీట్ నమోదు చేసి కేసు ట్రయల్స్ నడుస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాల భర్తీ, నామినేటెడ్ పోస్టుల్లో సగం మహిళలకే ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 15వ తేదీన 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఇంతగా ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇంకొకటి లేదని సీఎం జగన్ అన్నారు.
0 Comments