N-95 ‌మాస్కులు ఎంత భద్రం... కేంద్రం సూచనలేమిటి

N-95 ‌మాస్కులు ఎంత భద్రం... కేంద్రం సూచనలేమిటి


ఢిల్లీ: కరోనా వైరస్‌ ‌విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు జాగ్రతలు వహించాలని సూచిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నిరోధానికి ప్రధానంగా మాస్కులు ధరించాలని, మాస్కులు లేకుండా ఎట్టి పరిస్థితిల్లో బయటకు వెళ్లవద్దని కూడా సూచించాయి. ఇదే క్రమంలో ప్రజలు కరోనా వైరస్‌ ‌నుండి రక్షణ పొందడానికి వివిధ రకాల మాస్కులను వినియోగిస్తున్నారు. ఈ మద్యనే మాస్క్ ‌ధరించడం అంత్యంత శ్రేయస్కరంతో పాటు సురక్షితమని ప్రచారం జరగడంతో అధిక ధరకు లభించినా వాటినే వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు ప్రజలు. దేశంలో కరోనా వైరస్‌ ‌నానాటికి తీవ్ర రూపం దాలుస్తున్న నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాస్కుల వినియోగంపై ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలేమిటి.. ఎలాంటి మాస్కుల వినియోగంతో ప్రయోజనాలు ఉంటాయని తెలియజేస్తుంది.
కరోనాకు ప్రస్తుత పరిస్థితుల్లో మందులు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రతలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని... అంతే కాకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని పేర్కొంది. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానాలు విధిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా హెచ్చరిస్తూ ఎన్‌-95 ‌మాస్కులు అంత సురక్షితం కావని, దీని వల్ల కరోనా వ్యాప్తిని నిరోధించలేమని, వాల్వులు ఉన్న ఎన్‌-95 ‌మాస్కుల వల్ల వైరన్‌ను నిరోధించలేమని, దీని వల్ల మేలుకంటే హాని ఎక్కువగా ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం.
ఎలాంటి మాస్కులను కేంద్రం సూచిస్తోంది..?
ఇక ఇంట్లో బట్టతో తయారు చేసిన మాస్కులు వినియోగం చాలా సురక్షితమంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తాము ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. ఎన్‌-95 మాస్కుల వినియోగం వల్ల వైరస్ బయటకు వెళ్లదని వెల్లడించింది. ముఖాన్ని కప్పుకునేందుకు ఇంట్లో తయారు చేసిన మాస్కులను వినియోగించడం ఉత్తమం అని ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన అడ్వైజరీల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ప్రతిరోజూ బట్టతో చేసిన ఈ మాస్కులను శుభ్రంగా కడుక్కుని తిరిగి ధరించుకోవచ్చని వెల్లడించింది.
మాస్కులు మళ్లీ వాడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇక ఈ తరహా క్లాత్ మాస్కులను వేడినీటిలో 5 నిమిషాల పాటు ఉంచి ఆపై వాష్ చేయాలని వెల్లడించింది. అనంతరం మాస్కును ఆరబెట్టాలని పేర్కొంది. ఈ వేడినీళ్లలో కాస్త ఉప్పు కలిపితే మెరుగ్గా ఉంటుందని వెల్లడించింది. ఇక ఈ మాస్కులు తయారు చేసేటప్పుడే ఆ బట్ట ముఖాన్ని పూర్తిగా కప్పివేసేలా కొలతలు తీసుకుని ఆ తర్వాత తయారు చేసుకోవాలని సూచించింది. ముఖానికి ధరించినప్పుడు మధ్యలో గ్యాప్ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఇక ఫేస్ మాస్కు ధరించకుముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించిన కేంద్ర ప్రభుత్వం... తిరిగి వాడే ముందు కచ్చితంగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాతే ధరించాలని సూచన చేసింది. అంతేకాదు ఒకరి ఫేస్‌ మాస్క్‌ మరొకరు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదని కోరింది.

Post a Comment

0 Comments