దారుణం.. ఆక్సీజన్ అందక ఒకే ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి

దారుణం.. ఆక్సీజన్ అందక ఒకే ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి

సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పేషెంట్లు చనిపోయారని ధర్నాకు దిగారు

నిజామాబాద్‌లో దారుణం జరిగింది. ఆక్సీజన్ అందక ప్రభుత్వాస్పత్రిలో నలుగురు రోగులు మరణించారు. వీరిలో ముగ్గురు కరోనా పేషెంట్లు ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆక్సిజన్ సిలిండర్ అయిపోవడంతో.. శ్వాస ఆడక వీరు చనిపోయారు. కోవిడ్ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు పేషెంట్లతో పాటు సాధారణ వార్డులో మరొకరు కన్నుమూశారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పేషెంట్లు చనిపోయారని ధర్నాకు దిగారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆస్పత్రి వద్ద బందోబస్తు పెంచారు.

ఇప్పటికే తెలంగాణలో కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యచికిత్సపై ఎన్నో విమర్శలున్నాయి. చెస్ట్ ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ వీడియో తీసి ఆస్పత్రుల్లో పరిస్థితులను బయటపెట్టారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని.. వెంటిలేటర్ తీసేశారని ఆరోపించారు. ఆ తర్వాత మరణించారు. ఈ ఘటనలపై తీవ్ర దుమారం రేగింది. అటు గాంధీ ఆస్పత్రిలోనూ వైద్య సదుపాయాలు సరిగా లేవని.. జర్నలిస్ట్ మనోజ్ సహా పలువురు రోగులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇప్పుడు నిజామాబాద్ ఆస్పత్రిలో ఏకంగా నలుగురు రోగులు చనిపోవడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Post a Comment

0 Comments