అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ : కేసీఆర్‌

అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ : కేసీఆర్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం. అవసరమైతే హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ అనేది చాలా పెద్ద విషయమని.. దీనిపై ప్రభుత్వ యంత్రాగాన్ని సన్నద్ధం చేయాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ చాలా పెద్ద నగరమని.. ఇక్కడ కోటి మంది నివసిస్తున్నారని కేసీఆర్‌ తెలిపారు. అన్ని నగరాల్లో మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. కరోనా పెరగడంతో చెన్నైలో మరోసారి లాక్‌డౌన్‌ విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌కు సంబంధించి రెండు, మూడు రోజుల్లో కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ సారి లాక్‌డౌన్‌ విధిస్తే.. కఠిన అంక్షలు అమలు చేయనున్నట్టుగా సమాచారం.

Post a Comment

0 Comments