తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సి. తాజాగా ఆమె ఇంటి కరెంట్ బిల్లు చూసి షాకయ్యారట. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.36వేలు బిల్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంటూ సాధారణంగా వచ్చే బిల్లుతో పోలిస్తే 10రెట్లు ఎక్కువగా వచ్చిందని మండిపడ్డారు.
‘‘మూడు నెలల లాక్‌డౌన్. గత నెలలో భారీగా కరెంటు బిల్లు రావడానికి అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా ఏ గృహోపకరణాలు తెచ్చానా? అని ఆశ్చర్యపోయా. ‘అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి’ మీరు ఎలాంటి కరెంటు అందించినందుకు ఇంత మొత్తంలో బిల్లు వేశారు?’’ అంటూ ట్వీట్ చేసిన తాప్సి.. తాను వినియోగిస్తున్న గృహోపకరణాల్లో లోపం లేదు కదా! అని అన్నారు. అంతేకాదు. గత మూడు నెలల బిల్లులను కూడా ఆమె పంచుకున్నారు. ఏప్రిల్‌లో రూ.4,390.. మేలో రూ.3,850.. జూన్‌లో రూ.36,000 వచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం తన అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, దాన్ని శుభ్రం చేయడానికి వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ నిజంగా ఆ అపార్ట్‌మెంట్‌లో నివశిస్తుంటే ఇంకెంత కరెంటు బిల్లు వచ్చేదోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాప్సి వరుస ట్వీట్లు చూసిన అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ ఆమెకు సందేశాన్ని పంపింది. అయితే, ఆ సందేశంలో ఉన్న లింక్ పనిచేయకపోవడంతో మరోసారి ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘స్పందన అద్భుతంగా ఉంది.
అయితే, సరైన లింకును పంపించి ఉంటే బాగుండేది’ అని చురకలంటించారు. తాప్సి ఈ ఏడాది ‘థప్పడ్’చిత్రంలో నటించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
0 Comments