ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం

ఏపీలో సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం


నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు. 

నేటి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు. 

నెల్లూరు జిల్లా ఆయుర్వేద మందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు.

Post a Comment

0 Comments