బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. వారికి గుడ్‌న్యూస్

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. వారికి గుడ్‌న్యూస్

తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్, ఆశాజనకంగా వుండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం కేసిఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు.
పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం తెలిపారు. ఈ పథకం ద్వారా యాదవులు గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 70వేల యూనిట్లకు కొనసాగింపుగా.. మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణికి గాను, రానున్న బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సిఎం తెలిపారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని, దేశంలోనే అత్యంత అధికంగా గొర్రెల జనాభా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపధ్యంలో, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సిఎం తెలిపారు. అదే విధంగా ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం అన్నారు.

Post a Comment

0 Comments