ధరణి పోర్టల్లో మరో కొత్త ఆప్షన్.. ఆ సమస్యలకు పరిష్కారం

ధరణి పోర్టల్లో మరో కొత్త ఆప్షన్.. ఆ సమస్యలకు పరిష్కారం


తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం పారదర్శకంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఒక్క రూపాయి కూడా లంచం చెల్లించాల్సిన పనిలేకుండా.. ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దారు. అందులో భాగంగా తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా రెవెన్యూ కోర్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో వినియోగదాల సౌకర్యార్థం కొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో మరో కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. గతంతో పోల్చితే కొత్త పట్టాదార్‌ పాసుపుస్తకాల్లో విస్తీర్ణం తక్కువగా నమోదైనవారు దరఖాస్తు చేసుకొనేందుకు సిటిజన్‌ లాగిన్‌లో "అప్లికేషన్‌ ఫర్‌ మిస్సింగ్‌ సర్వే ఎక్స్‌టెంట్" ఆప్షన్‌ను జతచేశారు. 

ఇందులో జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌, ఉప సర్వే నంబర్‌ను ఎంచుకొన్న తర్వాత.. సంబంధిత యజమానికి ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి ఉన్నదో కనిపిస్తుంది. సమస్య ఉన్న సర్వే నంబర్‌ను ఎంచుకొని, పక్కన ఉన్న బాక్స్‌లో వాస్తవ విస్తీర్ణం ఎంత ఉండేదో వివరించాల్సి ఉంటుంది. ఇలా చేసిన దరఖాస్తులు అన్నీ కలెక్టర్ వద్దకు చేరుతాయి. ఈ దరఖాస్తులపై విచారణ జరిపి కలెక్టర్లు వాటిని పరిష్కరిస్తున్నారు.

ఇక, కొన్ని వారాల క్రితం ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.


Post a Comment

0 Comments