ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశాయి. విజయదశమి నుంచి రెండు పార్టీలు బరిలోకి దిగనున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరు ఐటి నిపుణులతో నిర్వహించిన వెబినార్‌లో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. జనసేన పార్టీ బలోపేతం - దేశాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అనే అంశంపై బెంగళూరు ఐటీ టీం సభ్యులు నాదెండ్ల మనోహర్‌తో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘ప్రజా గొంతుకై నిలబడాలి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని స్థాపించిన జనసేన పార్టీని ఆదిలోనే తొక్కేయాలని రెండు బలమైన పార్టీలు ప్రయత్నించాయి.
సంబంధం లేకపోయినా ఎన్నికల సమయంలో ఒక పార్టీకి బీ-టీమ్ అంటూ విష ప్రచారం చేశాయి. కొంతమందిని పార్టీలోకి పంపించి ఎన్నికల తర్వాత బయటకు వచ్చి పార్టీపై బురద జల్లే ప్రయత్నం కూడా చేశాయి. అయితే నిస్వార్ధం, నిబద్ధతగా పని చేసే జన సైనికులు, యువత వల్ల ఆ కుతంత్రం విఫలమయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీ ఈ రోజు బలంగా నిలబడింది అంటే దానికి ప్రధానం కారణం యువతే. కరోనా సమయంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది కూడా యువతే’ అని అన్నారు.
0 Comments