ఏపీలో భూముల రీ సర్వే చేపట్టాలని చాలాకాలం భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం... ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ భూముల రీ సర్వే కోసం కేబినెట్ సబ్‌కమిటీని నియమించారు. భూముల రీ సర్వేలో ఇబ్బందుల పరిష్కారంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సబ్‌కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, వ్యవసాయం, జలవనరుల శాఖ మంత్రులుగా ఉంటారు. భూ పరిపాలన, ల్యాండ్ టైటిల్స్, సమర్థ నీటి నిర్వహణపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం చేయనుంది. జనవరి 1 నుంచి భూముల రీ సర్వే చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అర్బన్ ప్రాంతాల్లోనూ సమగ్ర భూ సర్వే చేయాలని సీఎం జగన్ సూచించారు.
భూ సర్వే వివాదాల పరష్కారానికై మొబైల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. భూములను సర్వే చేసే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామని.. ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.
0 Comments