ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిని క్రేజీ హీరో ప్రభాస్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు చెట్లు నాటడం కాకుండా.. ఏకంగా ఓ అడవిలో పెద్ద ఎత్తున చెట్లు నాటించే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. దుండిగల్ సమీపంలోఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకునేందుకు ప్రభాస్ ముందుకొచ్చారు. ఇందుకు సంబంధించి కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు శంకుస్థాపన జరిగింది. కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్, హీరో ప్రభాస్ పాల్గొన్నారు. జువ్వి, కుసుమ, రావి మొక్కలు నాటారు.
ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. తండ్రి దివంగత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణరాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్.. అనంతరం వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలను పరిశీలించారు. త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.
0 Comments