cm jagan కీలక నిర్ణయం కోవిడ్‌ చికిత్సకు అదనంగా రూ.1,000 కోట్లు

cm jagan కీలక నిర్ణయం కోవిడ్‌ చికిత్సకు అదనంగా రూ.1,000 కోట్లు


కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల సంఖ్య పెంచేందుకు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఆరు నెలల్లో ప్రభుత్వం అదనంగా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనుందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులకు రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ వంటి మందులను ఎంత ఖరీదైనా సరే అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. ఈ మందులకు ఒక్కో కోర్సుకు రూ.35 వేల వరకు అవుతుందని, అయినా ఖర్చు విషయంలో వెనకాడవద్దని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్‌ రోగులకు చికిత్స కోసం వైద్య ఆరోగ్యశాఖలో వచ్చే ఆరు నెలలకు పెద్ద ఎత్తున స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించేందుకు ఆయన ఆమోదం తెలిపారు. కరోనా నివారణ చర్యలపై జగన్‌ శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.

మరణాలు తగ్గాలి

కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మరణాల సంఖ్య తగ్గించడంపై దృష్టి పెట్టాలన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 58 వేల పరీక్షలు చేస్తున్నామని, కంటెయిన్‌మెంట్‌ క్లస్టర్లలోని వారికి, కొవిడ్‌ సోకడానికి ఆస్కారం ఉన్నవారికీ పరీక్షలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దానివల్లే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు. రానున్న కొన్నిరోజుల్లో కేసుల తీవ్రత ఇలాగే కొనసాగి, తర్వాత తగ్గుముఖం పడుతుందని వివరించారు. అంకెల్ని చూసి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కొత్తగా గుర్తించిన ఆస్పత్రుల్లో మౌలిక వసతులు

రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్స కోసం కొత్తగా గుర్తించిన 54 ఆస్పత్రుల్లో సత్వరమే మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాల్లో కొవిడ్‌ ఆస్పత్రుల సంఖ్య పెంచడం వల్ల 39,051 పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. వాటిలో ఐసీయూ బెడ్‌లు 4,300, ఆక్సిజన్‌ సదుపాయం కలిగిన నాన్‌ ఐసీయూ బెడ్‌లు 17,380, నాన్‌ ఐసీయూ బెడ్‌లు 17,371 ఉంటాయన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 72,711 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో చికిత్స పొందుతున్నవారు 34,556 మంది ఉన్నారని, వారికి సేవలందించేందుకు సదుపాయాలన్నీ ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ క్రిటికల్‌కేర్‌ ఆస్పత్రుల సంఖ్యను 10కి పెంచాలని ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు అమలయ్యాయని సీఎం ప్రశ్నించారు. తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రభుత్వ సర్వజనాసుపత్రుల్ని, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆశ్రమ్‌ ఆసుపత్రిని క్రిటికల్‌కేర్‌ ఆస్పత్రులుగా మారుస్తున్నామని, వాటిలో అనంతపురం, శ్రీకాకుళం తప్ప మిగతా మూడు ఇప్పటికే సిద్ధమయ్యాయని వివరించారు. అవి రాష్ట్రస్థాయి ఆస్పత్రులు కాబట్టి అక్కడ అందించే సేవలు అత్యుత్తమంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

పరీక్షలకు రోజుకు రూ.5 కోట్లు

ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు రూ.5 కోట్లు, క్వారంటైన్‌ కేంద్రాల్లో భోజనం, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనకు రూ.1.5 కోట్లు ఖర్చవుతున్నట్టు సీఎం తెలిపారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments