విజయ దశమి, దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు.
శ్లోకం: ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం, బింబాధరం పృథులమౌక్తిక శోభినాసమ్; ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం, మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్!
త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.
0 Comments