తెలంగాణలో విద్యా సంస్థలకు 8 నుంచి సెలవులు.. మరి లాక్ డౌన్ ఉందా..?

తెలంగాణలో విద్యా సంస్థలకు 8 నుంచి సెలవులు.. మరి లాక్ డౌన్ ఉందా..?

రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కరోనా వ్యాప్తి, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సంబంధిత ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ సన్నద్ధత సహా తదితర అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ అవసరం లేదని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితుల మేరకు ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో పడకలు, టెస్ట్ కిట్లు, మందులు సమకూర్చుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్కు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

Post a Comment

0 Comments