సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను విజయశాంతి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి ఆయనను శాలువతో సత్కరించారు. ఇక, విజయశాంతితో పాటు అమిత్ షాను కలిసినవారిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడిన విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొనున్నారు. విజయశాంతి బీజేపీలో చేరనున్న విషయంపై బండి సంజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఈ భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడూతూ.. విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి కీలక భూమిక పోషించారని గుర్తచేశారు.
తెలంగాణ ఉద్యమ కారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అణచివేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను ఎదర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా అభినందనలు తెలిపారని చెప్పారు. అయితే అమిత్ షాను కలవడానికి ముందు విజయశాంతి ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కిషన్‌రెడ్డి, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామిలతో ఆమె చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ అనంతరం విజయశాంతి అమిత్ షాను కలిశారు.
0 Comments