ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగించే మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం (EHS) లోప్రస్తుతం ఉన్న 1889 రకాల వ్యాధులతో పాటు ఈనెల 19వ తేదీ నుంచి అదనంగా మరో 46 రకాల క్యాన్సర్ చికిత్స విధానాలను చేర్చారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి డాక్టర్ మల్లిఖార్జున తెలియజేయజేశారు. ఈ చికిత్సలలో 10 సర్జికల్ ఆంకాలజీ,32 మెడికల్ ఆంకాలజీ మరియు 4 రేడియేషన్ ఆంకాలజీ చికిత్సలను కొత్తగా చేర్చినట్టు వివరించారు.
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం హెల్త్ కార్డు కలిగిన వారందరూ కొత్తగా చేర్చిన క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన వైద్య సేవలను అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రులలో పొందవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను www.ysraarogyasri.ap.gov.in లో చూడవచ్చని అన్నారు. ఇందుకోసం 18004251818 టోల్ ఫ్రీ నెంబర్ కూడా పని చేస్తోందని.. ఈ నంబర్‌కు ఫోన్ చేసినా సమాచారం లభిస్తుందని తెలిపారు. చికిత్స పొందాలనుకునే వాళ్లు ఏదైనా నెట్‌వర్క్ హాస్పిటల్ లోని ఆరోగ్య మిత్ర ద్వారా కూడా తెలుసుకోవచ్చని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మల్లిఖార్జున తెలియజేయజేశారు.
ఇప్పటికే పేదలకు వర్తించే ఆరోగ్యశ్రీ సేవల్లోనే అనేక కీలక మార్పులను చేసిన జగన్ సర్కార్.. వేల సంఖ్యలో వ్యాధులను చేర్చడం, రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును పథకం కిందకు తెచ్చి భారీ సంస్కరణలకు తెరతీసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది.ప్రతి జేసీ వారానికి రెండు ఆస్పత్రులను తనిఖీ చేయడంతోపాటు సేవలు సరిగా లేకుంటే ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ చక్కటి వైద్యం అందించాలని, రోగులను గౌరవప్రదంగా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
అప్పులు చేసి వైద్యం చేయించుకుని.. ఆ నగదు రీయింబర్స్‌మెంట్ కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే విధానం మారాలని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కోసం పంపే దరఖాస్తుల సంఖ్యను భారీగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నగదు రహిత వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించేలా.. ప్రతి నెట్‌వర్క్ ఆస్పత్రిపైనా నిఘా ఉంచేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.
0 Comments