తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదర్శంగా నిలిచేందుకు రెడీ అయ్యారు. కరోనా వ్యాక్సిన్ మీద ప్రజల్లోనూ, వైద్య సిబ్బందిలోనూ ఎక్కడో ఓ మూల ఉన్న చిన్న భయాన్ని పోగొట్టేందుకు ఆయన నడుం బిగించారు. దేశంలో తొలిదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో నిర్వహించే కార్యక్రమంలో తొలి టీకా మంత్రి ఈటల రాజేందర్ తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయన ధ్రువీకరించారు. ‘తెలంగాణ ప్రజల్లో కొంత భయాలు ఉన్నాయి. టీకా వేసుకుంటే ఏమైనా అవుతుందేమోనని వారు భయపడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. వారిలో భయం పోగొట్టడానికి నన్ను ముందుకు రావాలన్నారు. అందుకు నేను కూడా రెడీ. తొలి టీకా నేనే తీసుకుంటా.’ అని మంత్రి ఈటల ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్ లైన్ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈనెల 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు మంత్రి ఈటల టీకాను వేయించుకుంటారు. గాంధీ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమానికి మంత్రి ఈటలతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 139 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలిదశలో హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా టీకా వేస్తారు. ఆ తర్వాత పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బందికి ప్రాధాన్యతా క్రమంలో అందిస్తారు. అయితే, కేంద్ర ప్రభుత్వం సూచించినట్టు కాకుండా రోజుకు ఒక వ్యాక్సినేషన్ సెంటర్‌లో 30 మందికి మాత్రమే కరోనా టీకా వేయనున్నారు. ప్రజల్లో ఉన్న భయం పోగొట్టే వరకు ఇలా చేస్తామని, ఆ తర్వాత టీకాలు వేసే సంఖ్య పెంచుతామని చెప్పారు.
తెలంగాణలో మొదటి రోజు 139 ప్రభుత్వ ఆస్పత్రులల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నారు. రెండో దశలో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేటు ఆస్పత్రులలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్రంలోని 33 జిల్లాలకు మొదటి విడుతగా 5,527 కోవిడ్ షీల్ టీకా వాయిల్స్ పంపిణీ చేశారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి వరంగల్ అర్బన్ జిల్లాకు 2,640 డోసులు ( 264 వాయిల్స్), వరంగల్ రూరల్ జిల్లాకు 580 డోసులు (58 వాయిల్స్), మహబూబాబాద్ జిల్లాకు 1720 డోసులు (172 వాయిల్స్), జనగాం జిల్లాకు 830 డోసులు (83 వాయిల్స్), ములుగు జిల్లాకు 560 డోసులు (56 వాయిల్స్), భూపాలపల్లి జిల్లాకు 500 డోసులు (50 వాయిల్స్) రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనవరి 17వ తేదీ నుండి 21 ప్రభుత్వ ఆస్పత్రులలో కోవిడ్ వ్యాక్సిన్ వేస్తారు.
0 Comments