తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి, పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేయాలని హోంమంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ కోరారు. విపత్తుల నిర్వహణ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అందుకే అమిత్ షాను కలిసి రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. అమిత్ షాతో భేటీకి ముందు కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు. షెకావత్ నివాసంలో సుమారు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులున్నాయి.
రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. దేశంలో కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు రోజు డిసెంబర్ 9న కేసీఆర్ ఈ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ఆత్మ గౌరవానికి ప్రతికగా నిలుస్తుందన్నారు. "దేశ రాజధానిలో ఉన్న ప్రభుత్వ భవనాలు అవసరాలకు తగినట్టుగా లేవు. పైగా అవి గత వలస పాలనకు చెందినవి. ఈ క్రమంలోనే ఇలాంటి నిర్మాణం ఎప్పుడో చేపట్టాల్సింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు భారతదేశ ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు గర్వకారణం. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలి" అని సీఎం కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
0 Comments