ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలన్న సబ్ కమిటీ సిఫారసుకు ఆమోదం తెలిపింది. మొదట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలోనే పేరుగాంచిన ఏదైనా ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్రంలో ఫైర్ డిపార్ట్మెంట్ ను నాలుగు జోన్ లుగా విభజించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఫైర్ డిపార్ట్మెంట్ లో ఖాలీగా వున్న పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) బలోపేతంపై కెబినెట్లో చర్చ జరిగింది. ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని యోచనలో ప్రభుత్వం ఉంది. ఆన్ లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాల కట్టడి బాధ్యతలను ఎస్ఈబీ పరిధిలోకి తేవాలని ప్రతిపాదించారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలను నిరోధించిన బాధ్యతలనూ ఎస్ఈబీకి అప్పగించాలని సూచించారు. ఎస్ఈబీ ప్రస్తుతం మద్యం, ఇసుక అక్రమ రవాణపై నిరోధం బాధ్యతలు నిర్వర్తిస్తోంది. రూ.5382 కోట్లతో మచిలీపట్నం పోర్టు నిర్మించడానికి సంబంధించిన డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0 Comments