(చట్టం-నిజామాబాద్)వరుస సస్పెన్షన్ లతో అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హడలెత్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే 5 అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేయడం.. అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతి రోజూ ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోన్న కలెక్టర్.. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కొరఢా ఝులిపిస్తున్నారు.
దీంతో ఏ రోజు కలెక్టర్ ఎక్కడికి వస్తారో.. ఎవరిని సస్పెండ్ చేస్తారోనని అధికారులు, సిబ్బంది టెన్షన్ పడుతున్నారు. గత డిసెంబర్ 24న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న నారాయణరెడ్డి.. నాలుగు రోజులకే విధులకు గైర్హాజరైన నవీపేట్ ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాకేష్ ను సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత నిన్న సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడ్ని సస్పెండ్ చేశారు. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో తనిఖీకి వెళ్లిన కలెక్టర్ గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రతను చూసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి నగేష్ ను సస్పెండ్ చేశారు.
సర్పంచ్ కు నోటీసు జారీ చేయగా.. ఎంపీడీవో, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మెమోలు జారీ చేశారు. అలాగే కొంతకాలంగా అనుమతి లేకుండా 80రోజులుగా గైర్హాజరైన నాగారం మైనార్టీ వసతి గృహం రికార్డ్ అసిస్టెంట్ జకీర్ ఖాన్ ను సస్పెండ్ చేస్తూ నిన్న ఉత్తర్వులిచ్చారు. విధుల్లో చేరిన పదిహేను రోజుల్లోనే ఐదుగురిని కలెక్టర్ సస్పెండ్ చేయడంతో జిల్లాలోని అధికారులు, సిబ్బందిలో గుబులు రేగుతోంది. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు.

0 Comments